Thursday, November 16, 2006

సుందర కాండ ముందు జరిగిన కధ

మాయలేడిని చూసి సీత
తెచ్చి ఇమ్మని రామునడిగె
సరియె తెచ్చెద ననుచు రాముడు
అడవి దిశగా పయనమయ్యె

ఘడియ గడచె ఝాము గడిచె
రాముడెంతకు తిరిగి రాక
కీడు తలచిన సాధ్వి సీత
వెదికి రమ్మని తమ్మునంపె

సీత ఆజ్ఞను శిరము దాల్చి
గీత దాటకని ఆనతిచ్చి
అన్న కొరకై దారి వెదకుచు
పేరు పిలుచుచు అడవి తిరిగె

అన్న దమ్ములు ఇంట లేక
సీత ఒంటరైన అదనుగని
భిక్షకు వచ్చి అసురపతి
గీత దాటమనె బిక్షవేయమనె

దానమివ్వగ గీత దాటిన
సీత నతడు అపహరించి
వాయు పధమున లంక దిశగా
పయనమయ్యె లంకాధిపతి

లేడి మాయని త్రుంచి రాముడు
తమ్ము తోడుగ తిరిగి వచ్చె
సీతను పిలిచె, లేదని వగచె
జాడను కనుగొన అడవులబట్టె

చెట్టు లేదు పుట్ట లేదు
సీతకై వెదకని తావులేదు
రేయి లేదు పగలు లేదు
మాతకై విలపించని క్షణము లేదు

సతుల నడిగె పతుల నడిగె
తపము చేయు యతులనడిగె
పగలు వీడిన వెదక తగనని
అస్తమించకని సూర్యునడిగె

ఘడియ గడిచె రోజు గడిచె
కాలి నడకన అడవి నడిచె
క్షణము క్షణము సతిని వెదకి
జాడ తెలియక విభుడు వగచె

శివుని విల్లు విరిచి వలచిన
దేవి చూపులు గురుతుకొచ్చె
సీత హాసము ఎదన మెదల
రామ నయనము ఎర్రబారె

తిరిగి అలసిన తనువు తోడి
వెదికి సొలసిన కనుల తోడి
ఈడ్చుకుంటూ తనువులిరివురు
ఒక్క చోటికి చేరినంతనె

బాధ నిండిన మూలుగొక్కటి
వారి చెవులకు అందగా
సీత యేమో అన్న ఆశయు
సీత దేమో అన్న భయమును

వివిధ భావములు వారి మనసున
ఒక్కసారిగ తలలు యెత్తెను
ధీరులైన రాచబిడ్డలు
శక్తి అంతా కూడగట్టిరి

మూలుగొచ్చిన దిశను చూసిరి
సీత కాదని కుదుట పడిరి
మెల్ల మెల్లగ అచట చేరి
అది పక్షి రాజని తెలుసుకొనిరి

రెక్కలిరిగిన పక్షిని చూసి
సాదరమ్ముగ చేరతీసిరి
"జటాయువని పిలిచుదురందరు
రామచంద్రుని భక్తుడ నేను

అసురుడు ఒక్కడు అధిపతి లంకకు
రావణుడందురు సీతను తెచ్చెను
మార్గ మధ్యమున అడ్డగించితి
అతని శక్తికి నేలకొరిగితి "

అదివిని రాముడు చేరదీసి
తండ్రి సముడవని పూజచేసె.
చివరి క్షణములు వచ్చె తనకని
చేతులెత్తి రాఘవునికి మొక్కి,
సీత వెళ్ళిన దిక్కు చూపి
ఆయువొదిలెను వృద్ధ గృద్ధము.


జటాయు చెప్పిన దిశకు మరల
రామ లక్ష్మణులు బయలుదేరిరి
గట్టులెక్కుచు చెట్టు లెక్కుచు
దిక్కులు పిక్కటిల్లు పిలుపు నరచుచు

అడవి అంతయు కలియ తిరుగుచు
వైదేహి కొరకై వెదుకుతున్న
వీరులను హనుమ తేరి చూసెను
కట్టుకున్నవి నార చీరెలు
రాచ బిడ్డల నడక తీరు
చేత వున్నవి విల్లు అంబులు
మునులు కారని నిర్ణయించె

బాహు బలమున వీరికి సాటి లేరు,
ఘూఢచారులే మరి వేరుకారని
తలచి హనుమ దరికి చేరి
రామ లక్ష్ములని ముదమునెరిగె

మహా బలుడు, బుద్ధి కుశలుడగు
పవన సుతుడు మోడ్చి చేతులు
ఆనంద భాష్పములు చెంపల రాల
ఇట్లు పలికె అవనత శిరుడై


"కిష్కింద రాజ్య మిది,
నను మారుతి అందురు,
నీకు భక్తుడను,
సుగ్రీవ సచివుడను
అతని ఆజ్ఞపై ఇక్కడ కొచ్చితి "
విన్న రాముడు సంతసించి,
సుగ్రీవుని చేరి
సీత విషయము, విశద పరిచె.
సుగ్రీవుడది విని తన కధను చెప్పగ.

రాము డంతట ప్రతిన పూనెను
"వాలి చంపెద, రాజ్యమిచ్చెద"
సుగ్రీవు కూడ వరము నిచ్చె
"సీత నెదికెద, తెచ్చి ఇచ్చెద"

సుగ్రీవుడంతట, మూకలు పిలిచెను
నాల్గు దిక్కులకు వెదక పంపెను
దక్షిణ దిక్కుకు రామ చిహ్నము
చేత బూని, మారుతి వెడలెను,
అంగద, జాంబవంతాది వీరుల గొని.